ప్రతిపక్షం, జూన్ 19: జీ-7 సదస్సులో ప్రపంచ దేశాల నాయకులకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక భారతీయ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహాభారత కలంకారీ చిత్రకళను, ఆయన సతీమణికి తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పోచంపల్లి పట్టు వస్త్రాన్ని బహుమతిగా అందించారు. భారతీయ సంప్రదాయ కళలు, హస్తకళల వైభవాన్ని ప్రపంచ వేదికపై చాటిచెప్పేలా ఈ బహుమతులు ఆకట్టుకున్నాయి. అలాగే ఇతర దేశాధినేతలకు కూడా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ప్రత్యేక కళాఖండాలు, హస్తకళా వస్తువులు అందజేశారు. భారతీయ వారసత్వ సంపదకు ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

















