[t4b-ticker]

గంగూలీ దంపతులను చంపేస్తామంటూ బెదిరింపులు.. కోల్‌కతాలో కలకలం

ప్రతిపక్షం, ఆగస్టు 11: భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఆయన భార్య డోనా గంగూలీని చంపేస్తామంటూ బెదిరింపులు రావడం కలకలం రేపింది. గత ఆరు నెలలుగా తమకు బెదిరింపు లేఖలు వస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందడంతో కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తాజాగా గంగూలీ కార్యాలయానికి రెండు బెదిరింపు లేఖలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వాటిని గుర్తించిన కార్యాలయ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లేఖల్లో గంగూలీతో పాటు ఆయన భార్య డోనాను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు చేసినట్లు తెలుస్తోంది.

ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో బెల్గారియాకు చెందిన ఓ వ్యక్తి ఈ లేఖలను పంపినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అయితే బెదిరింపుల వెనుక అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

గత ఆరు నెలలుగా బెదిరింపు లేఖలు వస్తున్నప్పటికీ తాజాగా ఫిర్యాదు చేయడం, ఇప్పుడు మరో రెండు లేఖలు రావడంతో పోలీసులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. లేఖలు ఎక్కడి నుంచి పంపారు, వాటిని పంపిన వ్యక్తి ఎవరు, బెదిరింపులకు కారణమేంటి అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో గంగూలీ కుటుంబానికి భద్రతకు సంబంధించిన అంశాలపైనా పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Spread the love

Related News

Latest News