ప్రతిపక్షం, ఆగస్టు 07: తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భారత కరెన్సీ నోట్లపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటాన్ని ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో నిరసన చేపట్టిన ‘భారత కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన కమిటీ’కి ఆయన మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, డాక్టర్ అంబేడ్కర్ కృషి వల్లే తనలాంటి దళితులు రాజకీయంగా ఎదిగి మంత్రి పదవులు చేపట్టగలిగారని అన్నారు. అంబేడ్కర్ లేకపోతే వెనుకబడిన వర్గాల పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడం కూడా కష్టమని పేర్కొన్నారు.
మహాత్మా గాంధీకి దేశం ఇచ్చిన గౌరవంతో సమానంగా డాక్టర్ అంబేడ్కర్‌కూ గౌరవం దక్కాలని మంత్రి అభిప్రాయపడ్డారు. కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ చిత్రపటాన్ని ముద్రించే అంశాన్ని ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి కూడా తీసుకెళ్తానని వెల్లడించారు.
భారత కరెన్సీపై అంబేడ్కర్ చిత్రపటాన్ని ముద్రించాలన్న డిమాండ్‌పై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

















