ప్రతిపక్షం, జూన్ 06: ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామం లేదని పేర్కొంటూ, గత ప్రభుత్వ పనితీరును ప్రశ్నించారు.
ఒక కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై బీఆర్ఎస్ నేతలు ప్రజల ముందుకు వెళ్లాలని సవాల్ విసిరారు. “డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించిన గ్రామాల్లో బీఆర్ఎస్ ఓట్లు అడగాలి. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లో నేను ఓట్లు అడుగుతా” అని వ్యాఖ్యానించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, “ఆ గ్రామాల్లో మీకు డిపాజిట్ వచ్చినా నా పేరు మార్చుకుంటా” అంటూ కేసీఆర్కు సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కాలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్పై మండిపడ్డారు.
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో గత పదేళ్లలో జరగని పనులను తమ ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే సాధించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా గృహనిర్మాణం, సంక్షేమ పథకాల అమలులో ప్రజా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని చెప్పారు.
కేసీఆర్కు రాజకీయ ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర అభివృద్ధి, ఇళ్ల నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలపై తనతో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సీఎం సవాల్ చేశారు. ప్రజల ముందు వాస్తవాలు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
సీఎం వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కే పరిస్థితి కనిపిస్తోంది.
















