ప్రతిపక్షం, జూలై 02: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు తగ్గుతున్న నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశాలపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష చేపట్టనుంది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు.
రెండు నెలల క్రితం అధిక ధరలకు దిగుమతి చేసుకున్న క్రూడ్ ఆయిల్ నిల్వలను ప్రస్తుతం ప్రభుత్వ రంగ చమురు సంస్థలు శుద్ధి చేస్తున్నందున, ఇంధన ధరల్లో వెంటనే తగ్గింపు సాధ్యం కాదని ఆయన తెలిపారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఇంధనం పాత నిల్వల ఆధారంగా ఉత్పత్తి అవుతుండటంతో ధరల సవరణకు కొంత సమయం అవసరమని వివరించారు.
అయితే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఇదే స్థాయిలో స్థిరంగా కొనసాగితే, దేశీయ ఇంధన ధరలను పునఃసమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై వినియోగదారుల్లో ఆశలు నెలకొన్నాయి.
















