ఆరోపణలను పట్టించుకోను.. అభివృద్దే నా లక్ష్యం..
పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ
ప్రతిపక్షం, రామగిరి(మంథని), ఏప్రిల్ 17 : ప్రజా సేవ కొరకై, ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నాకు ప్రజలే శ్రీరామరక్ష అని కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. బుధవారం రామగిరి మండలం సెంటినరీకాలనీ లోని శ్రీ కోదండ రామాలయంలో జరుపబడిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హాజరై దేవతామూర్తులను దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధనగిరి మనోహరాచర్యులు, గోవర్ధనగిరి శ్యాంసుందరాచార్యులు మంత్రోత్ఛారణల తో ఆశీర్వదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పాలనలో మొదటి సారిగా వచ్చిన ఈ శ్రీరామనవమి నుండి రాష్ట్రం అభివృద్ధి దిశగా ప్రయాణించాలని, అప్పుల కూబీలో కూరుకుపోయిన రాష్ట్ర ఆర్దిక స్థితిగతి మెరుగుపడి, ప్రజలు సంక్షేమంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.
అదేవిధంగా తనపై ప్రత్యర్థులు చేస్తున్నఆరోపణలపై స్పందించిన ఆయన దివంగత నేత కాకా వెంకటస్వామి, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే డా.వివేక్ వెంకటస్వామిలు చేసిన అభివృద్ధి పనులు ప్రజాసేవే వారికి విజయాలను చేకూర్చిందన్నారు. ప్రజాసేవే కర్తవ్యంగా భావించే రాజకీయ కుటుంబం నుండి వచ్చిన నేను తాత, తండ్రి చూపిన మార్గంలోనే ముందుకు నడుస్తూ మరింతగా ప్రజలకు సేవ చేయాలని లక్ష్యంతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టానన్నారు. తాను పారిశ్రామికవేత్తగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానే కానీ చెల్లని నోటుగా కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. నాయకుని లక్షణం అందుబాటులో ఉండటం మాత్రమే కాదని, ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం కూడా ఆన్న విషయాన్ని గుర్తేరిగినవాన్నని అన్నారు. ఆయనతో మాజీ జెడ్పీటీసీలు గంట వెంకటరమణ రెడ్డి, మైధం భారతి వరప్రసాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోరకొప్పుల తులసీ రాం, గాండ్ల మోహన్, చింతల శ్రీనివాస్ రెడ్డి, మాదసి విజయ్, మేకల మారుతి, సంతోష్ తదితరులు ఉన్నారు.