ప్రతిపక్షం, జూన్ 12: న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై చర్చించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు ఆమోదం ఇవ్వాలని, 122.9 కిలోమీటర్ల మేర రూ.38,595 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన ప్రాజెక్టును కేంద్ర-రాష్ట్ర సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేయాలని కోరారు.
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ఉత్తర, దక్షిణ కారిడార్లను ఒకేసారి ఆమోదించి పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్–అమరావతి–బందర్ పోర్ట్‌ను అనుసంధానించే 12 లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
అలాగే వరంగల్ విమానాశ్రయం పునరుద్ధరణ పనులను ప్రారంభించాలని, హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. సాగు, తాగునీటి అవసరాల కోసం గోదావరి జలాల వినియోగంపై మహారాష్ట్రతో చర్చలకు కేంద్రం సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు అత్యంత కీలకమని రేవంత్ రెడ్డి వివరించారు.

















