ప్రతిపక్షం, జూలై 25, హైదరాబాద్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యకు నిరసనగా నేడు హైదరాబాద్లో క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ ర్యాలీ సాయంత్రం 6:30 గంటలకు నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొనసాగనుంది.
విద్యార్థులకు సంఘీభావం తెలియజేయడం, వారి ఆందోళనకు మద్దతు ప్రకటించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ర్యాలీలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొననున్నారు.
విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని కోరుతూ ఈ క్యాండిల్ ర్యాలీ చేపడుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమం సందర్భంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థులకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.

















