తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక.. నేటి మధ్యాహ్నం నుంచే పలు జిల్లాల్లో జల్లులు

ప్రతిపక్షం, జూలై 25, హైదరాబాద్: తెలంగాణలో వర్షాల ప్రభావం క్రమంగా పెరగనున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. నేటి మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు.

వాతావరణ పరిస్థితులు రేపటి నుంచి మరింత అనుకూలంగా మారనున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకు పలు ప్రాంతాల్లో వర్షాల ప్రభావం కొనసాగే సూచనలు ఉన్నాయని తెలిపారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు, రైతులు, ప్రయాణికులు వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా, అవసరమైతేనే బయటకు వెళ్లాలని హెచ్చరిస్తున్నారు.

వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు కూడా వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో స్థానిక పరిస్థితులను బట్టి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.

Spread the love

Related News

Latest News