ప్రతిపక్షం, జూలై 24: నిరసనలు చేపడుతున్న విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ విమర్శించారు. విద్యార్థులను శత్రువుల్లా చూస్తూ వారి స్వరాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.
‘ది హిందూ’ పత్రికకు రాసిన వ్యాసంలో సోనియా గాంధీ మాట్లాడుతూ.. విద్యార్థులు జవాబుదారీతనం, పారదర్శకత, విద్యా వ్యవస్థలో సంస్కరణలను మాత్రమే కోరుతున్నారని పేర్కొన్నారు. అయితే వారి న్యాయమైన డిమాండ్లకు స్పందించాల్సిన కేంద్ర ప్రభుత్వం పిరికితనం, క్రూరత్వంతో వ్యవహరిస్తోందని విమర్శించారు.
అసమ్మతిని దేశద్రోహంగా ముద్రవేసే పాత విధానాన్నే కేంద్రం కొనసాగిస్తోందని ఆమె ఆరోపించారు. విద్యార్థుల శాంతియుత నిరసనలను బలహీనపరచడానికి, వారి ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
విద్యార్థుల ఆందోళనలను అణచివేయడం కాకుండా, వారు లేవనెత్తుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సోనియా గాంధీ సూచించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

















