ప్రతిపక్షం, జూలై 22: హాలీవుడ్ యువ నటి కేలీ హాటిల్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో 18 ఏళ్ల వయసులోనే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు, స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటన సినీ అభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
కేలీ హాటిల్ ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’, ‘గాడ్జిల్లా ఎక్స్ కాంగ్: ది న్యూ ఎంపైర్’ చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ రెండు చిత్రాల్లో వినికిడి లోపం ఉన్న ‘జియా’ పాత్రను సహజంగా పోషించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
కుటుంబ వారసత్వంగా కేలీకి వినికిడి లోపం ఉన్నప్పటికీ, అదే ఆమెను ప్రత్యేక నటిగా నిలబెట్టింది. సైన్ లాంగ్వేజ్ ద్వారా భావోద్వేగాలను అద్భుతంగా వ్యక్తీకరిస్తూ సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు. ఆమె నటనకు విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు లభించాయి.
అనూహ్య రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడంతో హాలీవుడ్ సినీ పరిశ్రమతో పాటు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు కేలీ హాటిల్‌కు నివాళులర్పిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

















