*మునుగోడు, దేవరకొండ రైతులకు డిండి లిఫ్ట్ ద్వారానే న్యాయం జరుగుతుంది – పల్లా వెంకట్ రెడ్డి
*మహబూబ్ నగర్ నాయకుల ఒత్తిడికి తలొగ్గి డీపీఆర్ మార్చడం దారుణం – ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
*పనులు వెంటనే ప్రారంభించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు
ప్రతిపక్షం మునుగోడు, హైదరాబాద్ అక్టోబర్ 19: మునుగోడు నియోజకవర్గం, దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు ఏదుల నుండి నీటిని తీసుకువచ్చి, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు.హైదరాబాద్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… నల్లగొండ జిల్లా రైతుల సాగునీటి కష్టాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని, అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
*డీపీఆర్ మార్చడం సరికాదు:
మహబూబ్ నగర్ రాజకీయ నాయకులకు తలొగ్గి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డీపీఆర్ ను మార్చడం సరైనది కాదని వారు స్పష్టం చేశారు. అసలు ప్రణాళిక ప్రకారం ఏదుల నుండి నీటిని తీసుకువస్తేనే మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ప్రాజెక్టును పక్కదారి పట్టించడం వల్ల నల్లగొండ జిల్లా రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు.
*సంవత్సరాలు గడుస్తున్నా పనులు పూర్తి కావడం లేదు:
సంవత్సరాలు గడుస్తున్నా నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టుల పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేయడం ద్వారా జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా నల్లగొండ జిల్లాకు సాగునీరు పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నారని విమర్శించారు. ప్రతిసారి హామీలు ఇవ్వడం తప్ప, ఆచరణలో మాత్రం ఏమీ జరగడం లేదని మండిపడ్డారు.నల్లగొండ జిల్లా అంటేనే ఫ్లోరైడ్ సమస్య, వలసలు, కరువుతో సతమతమవుతున్న జిల్లా అని, ఇలాంటి జిల్లాకు సాగునీరు అందిస్తేనే రైతులు బాగుపడతారని, వ్యవసాయం బతుకుతుందని అన్నారు. డిండి ప్రాజెక్టు పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు, తాగునీటి సమస్య కూడా తీరుతుందని వివరించారు.
*ఆందోళనలకు సిద్ధం:
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వెంటనే ప్రారంభించి నల్లగొండ జిల్లాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రారంభం చేయకపోతే, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని, రైతులను కలుపుకుని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా డిండి ప్రాజెక్టును పూర్తి చేయాలని, లేకపోతే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని సిపిఐ నేతలు తేల్చి చెప్పారు.





























