రాష్ట్రంలోనే ఆదర్శంగా సిద్దిపేటలో కార్తీక వనభోజన మహోత్సవం
ఆర్యవైశ్య సంఘ భవన నిర్మాణానికి వ్యక్తిగతంగా సహకరిస్తా
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, నవంబరు 29: ఐక్యత, ఆధ్యాత్మికత, సామాజిక సమైక్యతకు కార్తీక మాస సామూహిక వనభోజనాలు ప్రతీకగా నిలుస్తాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆర్యవైశ్యులంతా ఒకే వేదికపై చేరి సామూహిక కార్తీక దీపారాధన, వనభోజనాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్ధిపేటలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. సిద్ధిపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక కార్తీక దీపారాధన, కార్తీక వనభోజన మహోత్సవంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ భవన నిర్మాణ నమూనా బ్రోచర్‌ను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్తీక మాసానికి హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉందన్నారు. సూర్యోదయానికి ముందే భక్తిశ్రద్ధలతో నిర్వహించే పూజలు, దీపారాధనలు మన జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగులు నింపుతాయని చెప్పారు.
సామూహిక దీపారాధన.. సమాజానికి శుభం
ఒక్కొక్కరు ఇంట్లో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి వెలుగు వస్తుందని, అదే దేవాలయంలో అందరూ కలిసి దీపం వెలిగిస్తే యావత్ సమాజానికి, దేశానికి శుభం కలుగుతుందని హరీశ్ రావు అన్నారు. సామూహిక దీపారాధనలో ఐక్యత, భక్తిభావం ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. సిద్ధిపేటపై ప్రత్యేక ప్రేమతో ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి హనుమాన్ మాలాధారణ చేయిస్తూ భక్తులకు ఆశీస్సులు అందిస్తున్న శ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ సేవలను ఆయన ప్రశంసించారు. స్వామీజీ మంగళాశాసనాలు సిద్ధిపేట ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నేతి కైలాసం, ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, మహిళలు, సభ్యులకు అభినందనలు తెలిపారు.
సంఘ భవన నిర్మాణానికి సహకారం అందిస్తా
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వివిధ సామాజిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సరైన భవనం లేక సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ రావు తెలిపారు. సంఘ సభ్యుల విజ్ఞప్తి మేరకు భవన నిర్మాణానికి తన వ్యక్తిగతంగా ఇతోధిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.అందరూ కలిసి సంఘ భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. భవన ప్రారంభోత్సవాన్ని శ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ చేతుల మీదుగానే నిర్వహించుకుందామని అన్నారు. స్వామీజీ ఆశీస్సులు ఉంటే మంచి కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవని పేర్కొన్నారు.
స్వామీజీ సేవలు అభినందనీయం
దుర్గాప్రసాద్ స్వామీజీ స్వచ్ఛమైన హృదయంతో అందరి మేలు కోరుకునే వ్యక్తి అని హరీశ్ రావు అన్నారు. విజయవాడలో స్వామీజీ ఆధ్వర్యంలో జీర్ణావస్థలో ఉన్న దేవాలయాన్ని పునరుద్ధరించిన కార్యక్రమానికి తాను హాజరైన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ కార్యక్రమానికి త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ కూడా విచ్చేశారని చెప్పారు. ఇద్దరు స్వామీజీల ఆశీస్సులు పొందడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. నిరంతరం ధార్మిక, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దుర్గాప్రసాద్ స్వామీజీ ఆశీస్సులు తనకు, ఆర్యవైశ్య సంఘ సభ్యులకు, సిద్ధిపేట ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, సంఘ సభ్యులు, మహిళలు, భక్తులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సామూహిక కార్తీక దీపారాధన, వనభోజన మహోత్సవం భక్తి, ఆనందోత్సాహాల మధ్య వైభవంగా జరిగింది.






























