ఫేషియల్ హాజరు ఆధారంగానే ఉపాధ్యాయులకు వేతనాలు.. కలెక్టర్ల కీలక ఆదేశాలు

ప్రతిపక్షం, నవంబర్ 28: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల హాజరు విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. ఇకపై ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో నమోదైన హాజరు ఆధారంగానే వేతనాలు చెల్లించే దిశగా చర్యలు చేపడుతోంది. పాఠశాలలకు ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయుల వల్ల విద్యార్థుల చదువుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల కలెక్టర్లు ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరును పర్యవేక్షించేందుకు 2025 ఆగస్టు నుంచి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈ విధానం అమలులోకి వచ్చినప్పటికీ కొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులు ఇప్పటికీ హాజరు నమోదు చేయడం లేదని అధికారులు గుర్తించారు. ఈ విషయంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ పలుమార్లు జిల్లా విద్యాశాఖ అధికారులను హెచ్చరించినా ఆశించిన స్థాయిలో మార్పు కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు ఉపాధ్యాయుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు కొన్ని జిల్లాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు తక్కువగా ఉంటోందని పేర్కొన్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఫేషియల్ హాజరు విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని, ప్రతిరోజూ పర్యవేక్షించాలని ఆయన సూచించినట్లు సమాచారం.

ఫేషియల్ హాజరు ఆధారంగా వేతనాల బిల్లులు తయారు చేసి పంపించాలని వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. నాగర్‌కర్నూలు జిల్లాలోనూ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి ఫేషియల్ హాజరు ఆధారంగానే వేతనాలు చెల్లిస్తామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ప్రకటించారు. హాజరు వివరాలను ప్రతిరోజూ పరిశీలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

అయితే రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఈ అంశంపై అధికారికంగా లిఖితపూర్వక ఉత్తర్వులు వెలువడలేదు. అయినప్పటికీ పలు జిల్లాల్లో కలెక్టర్ల ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధానాన్ని తాము స్వాగతిస్తున్నామని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య తెలిపారు. అయితే ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత అమలు చేయాలని ఆయన సూచించారు.

మరోవైపు నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో విద్యార్థుల హాజరు 95 శాతానికి తగ్గకుండా చూడాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ రెండు నెలల్లో ఉపాధ్యాయులు సెలవులు తీసుకోకూడదని కూడా సూచించింది. అత్యవసరంగా సెలవు తీసుకోవాల్సి వస్తే అదనపు కలెక్టర్‌ అనుమతి పొందాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ జారీ చేసిన ఉత్తర్వులు చర్చనీయాంశంగా మారాయి. ఫేషియల్ హాజరు ఆధారంగా వేతనాల చెల్లింపు, సెలవులపై ఆంక్షల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల హాజరు వ్యవస్థలో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Related News

Latest News