[t4b-ticker]

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌పై స్టే ఎత్తివేత హర్షణీయం

  • పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్

ప్రతిపక్షం, కరీంనగర్‌, సెప్టెంబర్‌ 01: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల అమలుకు సంబంధించి సింగిల్‌ బెంచ్‌ విధించిన స్టేను ఎత్తివేస్తూ న్యాయస్థానం తీర్పు ఇవ్వడం హర్షణీయమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ అన్నారు. ఈ తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు ఎంతో కీలకమైనవని మంత్రి తెలిపారు. వివాహ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అర్హులైన కుటుంబాలకు ఈ పథకాల ద్వారా అందించే ఆర్థిక సాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
స్టే కారణంగా పెండింగ్‌లో ఉన్న అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులను పరిశీలించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించి ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అర్హత ఉన్న ఒక్క లబ్ధిదారుడికి కూడా అన్యాయం జరగకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించినట్లు చెప్పారు.

కోర్టు విధించిన స్టేను కొందరు రాజకీయ కోణంలో చూస్తూ, పథకాలు రద్దయినట్లు ప్రచారం చేయడం సరికాదని మంత్రి విమర్శించారు. న్యాయస్థానం తీర్పును వక్రీకరించి ప్రజల్లో గందరగోళం సృష్టించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగే అంశాలపై బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు సంతోషించడం ఆశ్చర్యంగా ఉందన్నారు.ప్రజల సంక్షేమం విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉందని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.పెండింగ్‌లో ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మరోసారి స్పష్టం చేసినట్లు మంత్రి తెలిపారు.

Spread the love

Related News

Latest News