20 నుంచి 30 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం
ఎంపీ మాధవనేని రఘునందన్ రావుకు టీఎన్జీవో జిల్లా నాయకుల వినతి
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, నవంబరు 29: వేగంగా అభివృద్ధి చెందుతున్న సిద్ధిపేట జిల్లాలో ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించేందుకు ఈఎస్ఐ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్) ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని టీఎన్జీవో సిద్ధిపేట జిల్లా నాయకులు కోరారు. ఈ మేరకు మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావును కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, జిల్లా కార్యదర్శి కోమండ్ల విక్రం రెడ్డి మాట్లాడుతూ.. సిద్ధిపేట జిల్లా కేంద్రంగా విద్య, వైద్యం, వ్యాపార, పారిశ్రామిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది సంఖ్య పెరుగుతోందని తెలిపారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి లేకపోవడం ఉద్యోగులకు తీవ్ర అసౌకర్యంగా మారిందన్నారు. ప్రస్తుతం ఈఎస్ఐ వైద్య సేవలు పొందాలంటే ఉద్యోగులు హైదరాబాద్కు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రయాణ ఖర్చులు, సమయం వృథా కావడంతో పాటు విధులకు సెలవు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోయారు. ముఖ్యంగా ప్రమాదాలు, గుండె సంబంధిత సమస్యలు, ఇతర అత్యవసర అనారోగ్య పరిస్థితుల్లో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
సిద్ధిపేటలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయడం వల్ల ఉద్యోగులకు స్థానికంగానే నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అవసరమైన వైద్య పరీక్షలు, మందులు, నిపుణుల చికిత్స, అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మహిళా ఉద్యోగులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు, వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన సుమారు 20 నుంచి 30 వేల మంది కార్మికులు, ఉద్యోగులకు ఈ ఆసుపత్రి ద్వారా ప్రయోజనం కలిగే అవకాశం ఉందన్నారు. స్థానికంగా ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటైతే ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, అత్యవసర సమయాల్లో సకాలంలో వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
అంతేకాకుండా సిద్ధిపేటలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయడం వల్ల జిల్లాలోని కార్మికుల ఆరోగ్య భద్రతకు భరోసా లభించి స్థానికంగా వైద్య మౌలిక సదుపాయాలు మెరుగు పడతాయని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, కార్మికుల ఆరోగ్య పరిరక్షణ, జిల్లాలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలకు అనుగుణంగా ఈఎస్ఐ వైద్య సదుపాయాల విస్తరణ అత్యవసరమని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి, సిద్ధిపేటలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయించి, మంజూరుకు కృషి చేయాలని ఎంపీకి విజ్ఞప్తి చేశారు. టీఎన్జీవో నాయకుల వినతికి ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సానుకూలంగా స్పందించారు. సిద్ధిపేటలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుద్దాల కృష్ణమూర్తి, సిద్దిపేట యూనిట్ అధ్యక్షుడు పోతుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.



























