నవంబర్ 29 లేకుంటే తెలంగాణ లేదు
తెలంగాణ లేకుంటే రేవంత్ సీఎం అయ్యేవారా?
దీక్షా దివస్ సభలో మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, నవంబరు 29: తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్షే పునాది అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత ఫ్లోర్ తన్నీరు హరీశ్ రావు అన్నారు. నవంబర్ 29న కేసీఆర్ దీక్ష చేపట్టకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం లేకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ది కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ పోరాటం, అమరుల త్యాగాల ఫలితమే ప్రత్యేక రాష్ట్రమని విస్పష్టంగా చెప్పారు. దీక్షా దివస్ సందర్భంగా ఆదివారం సిద్ధిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
సిద్ధిపేట నుంచే ఉద్యమానికి కీలక మలుపు
నవంబరు 29వ తేదీకి సిద్దిపేటతో విడదీయలేని అనుబంధం ఉందని హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ ‘సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదాన్ని సిద్ధిపేట గడ్డపై ప్రకటించారని గుర్తుచేశారు. క్యాంపు కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన సమావేశంలోనే ఆమరణ నిరాహార దీక్ష నిర్ణయాన్ని ప్రకటించారని తెలిపారు.
రంగదాంపల్లి చౌరస్తాలో దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేస్తే పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. ఎముకలు కొరికే చలిలోనూ కార్యకర్తలు శిబిరానికి కాపలా కాశారని గుర్తుచేశారు. ఆ పోరాటంలో ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేశారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
డిసెంబరు 9వ తేదీ విజయ దివస్‌గా జరపాలి
కేసీఆర్ దీక్ష ప్రారంభించిన 11 రోజుల తర్వాత డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిందని హరీశ్ రావు తెలిపారు. అయితే సీమాంధ్ర ప్రజాప్రతినిధుల రాజీనామాలతో కేంద్రం వెనక్కి తగ్గిందని అన్నారు. ఆ పరిణామాలతో వందలాది మంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కేసీఆర్ జేఏసీని ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను ఏకం చేశారని చెప్పారు. ఉద్యమాన్ని ఉధృతం చేసి పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా పోరాటం చేశారని పేర్కొన్నారు. నవంబర్ 29ను దీక్షా దివస్‌గా జరుపుకుంటున్నట్లే, డిసెంబర్ 9ను విజయ దివస్‌గా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి..
కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని హరీశ్ రావు అన్నారు. రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలతో ప్రజలకు మేలు జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు నిలిచి పోయాయని విమర్శించారు.రైతుబీమా, కేసీఆర్ కిట్, గొర్రెల పంపిణీ, న్యూట్రిషన్ కిట్, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులు ధాన్యం కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్లపైకి వస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.
సాగర్‌ను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే
నాగార్జునసాగర్ విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని చెప్పారు. గురుకుల విద్యార్థులకు అందించే భోజనం, దుస్తులు, కోడిగుడ్లలోనూ అవినీతి జరుగుతోందని విమర్శించారు.
సిద్ధిపేట సభకు రూ.50 కోట్లు ఖర్చు.. జిల్లాకు ఏం ఇచ్చారు?
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధిపేటలో నిర్వహించిన సభపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. 26 నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించి సభ నిర్వహించారని అన్నారు. బస్సులు, సభ నిర్వహణకు రూ.50 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. అంత ఖర్చు చేసిన ప్రభుత్వం సిద్ధిపేటకు కనీసం 50 పైసలైనా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. సభలు, ప్రచారాలతో కాకుండా అభివృద్ధి పనులతో ప్రజల మనసులు గెలుచుకోవాలని సూచించారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రను భావితరాలకు తెలియజేయాలి
సిద్ధిపేటకు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక స్థానం ఉందని హరీశ్ రావు అన్నారు. పాత బస్టాండ్ వద్ద నిరాహార దీక్షా శిబిరం 1,531 రోజుల పాటు కొనసాగిందని గుర్తుచేశారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు సిద్ధిపేట దీక్షా శిబిరాన్ని సందర్శించి ఉద్యమకారులతో మాట్లాడారని తెలిపారు.ఉద్యమ సమయంలో ఎన్నో అక్రమ కేసులు, అరెస్టులు, లాఠీ దెబ్బలు ఎదుర్కొన్నామని చెప్పారు. అయినా ఉద్యమం ఆగలేదన్నారు. సాగరహారం వంటి కార్యక్రమాలను ప్రజలంతా ఐక్యంగా విజయవంతం చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో పాత్రికేయుల సేవలు కూడా మరువ లేనివని కొనియాడారు. మలితరం యువతకు తెలంగాణ ఉద్యమ చరిత్ర, కేసీఆర్ దీక్ష, అమరుల త్యాగాల గురించి తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఉద్యమ జ్ఞాపకాలను భద్రపరచాలని, భావితరాలకు అందించాలని పేర్కొన్నారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరోసారి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, స్థానిక నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






























