[t4b-ticker]

17 నుంచి మండలాల్లోనూ ప్రజావాణి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

ప్రతిపక్షం, ఆగస్టు 15: ప్రజల సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ఇకపై మండల స్థాయికి విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి నేరుగా వినతులు, ఫిర్యాదులు స్వీకరిస్తామని సీఎం చెప్పారు. ప్రజలు తమ సమస్యలను మండల స్థాయిలోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు.

అదే సమయంలో ప్రజలకు మరింత సౌకర్యం కల్పించేందుకు త్వరలో ప్రజావాణిని ఆన్‌లైన్ విధానంలోకి కూడా తీసుకురానున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రజలు ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు.

ప్రజల సమస్యలకు స్థానిక స్థాయిలోనే పరిష్కారం లభించేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత బాధ్యతాయుతంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News