ప్రతిపక్షం, సెప్టెంబర్ 02: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026కు హాజరు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు ఈ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సదస్సులో భాగంగా నిర్వహించనున్న డిఫెన్స్ ఎక్స్‌పో–2026ను ప్రారంభించాలని రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం కోరారు.
ఢిల్లీలో పలువురు ఎంపీలతో కలిసి రాజ్‌నాథ్ సింగ్‌తో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలతో పాటు రక్షణ రంగంలో తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, భవిష్యత్ అవకాశాలపై చర్చించారు. డిఫెన్స్ ఎక్స్‌పోలో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నట్లు సీఎం వివరించారు. అంతేకాకుండా ప్రతిష్టాత్మక ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శన, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా రక్షణ రంగానికి చెందిన పరిశ్రమలు, అంకుర సంస్థలు, యువ శాస్త్రవేత్తలు పాల్గొనేలా డిఫెన్స్ ఎక్స్‌పోను నిర్వహించనున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. రక్షణ శాఖ మంత్రి స్వయంగా హాజరై మార్గనిర్దేశం చేస్తే కార్యక్రమానికి మరింత ప్రాధాన్యం లభిస్తుందని అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే డిఫెన్స్ ఎక్స్‌పో–2026ను విజయవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని, కేంద్ర రక్షణ శాఖ సహకారాన్ని కోరుతున్నట్లు తెలిపారు.
ఎయిర్‌షో నిర్వహణకు అవసరమైన గగనతల అనుమతులు మంజూరు చేయడంతో పాటు భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాలు ప్రదర్శనలో పాల్గొనేలా సహకరించాలని సీఎం కోరారు. స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రదర్శనకు కూడా కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ప్రదర్శనలో ఏర్పాటు చేసి, త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని కోరారు.
హెచ్‌ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, ఎండీఎల్ వంటి రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలతో పాటు డీఆర్‌డీఓ ప్రయోగశాలలు విస్తృతంగా పాల్గొని స్వదేశీ రక్షణ సాంకేతికతను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి కోరారు. విదేశీ రక్షణ శాఖల ప్రతినిధులు, ద్వైపాక్షిక రక్షణ ప్రతినిధి బృందాలు, అంతర్జాతీయ రక్షణ సంస్థల ప్రముఖులతో సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర రక్షణ శాఖ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన అంశాన్ని కూడా సీఎం రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. విమానాశ్రయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాల భూమిని సేకరించినట్లు వివరించారు. రక్షణ శాఖ కోరిన మేరకు మొత్తం 1,500 ఎకరాలు అవసరమైతే మరో 750 ఎకరాలను కూడా సేకరించి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ ఇప్పటికే అంగీకరించినట్లు సీఎం వెల్లడించారు. మొత్తం భూమికి సంవత్సరానికి కేవలం రూ.1 నామమాత్రపు లీజు అద్దెతో 33 సంవత్సరాల కాలానికి భూమిని కేటాయించనున్నట్లు తెలిపారు. అవసరమైతే మరో రెండు పర్యాయాలు లీజును పొడిగించుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
రక్షణ రంగంలో తెలంగాణను మరింత కీలక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు దేశీయ రక్షణ తయారీ, పరిశోధన, సాంకేతిక రంగాలకు రాష్ట్రంలో అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర రక్షణ శాఖ సహకారంతో డిఫెన్స్ ఎక్స్‌పో–2026ను అంతర్జాతీయ స్థాయిలో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు.
ఈ సమావేశంలో రాష్ట్ర శక్తి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేశ్‌కుమార్ షెట్కార్, పోరిక బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్) హర్కర వేణుగోపాల్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తదితరులు పాల్గొన్నారు.































