- నిందితుడిని దిశ తరహాలో కఠినంగా శిక్షించాలి: వాసాల శ్రీనివాస్ రావణ్
ప్రతిపక్షం, కరీంనగర్, సెప్టెంబర్ 2: ఉద్యోగం కోసం హైదరాబాద్కు వెళ్లి అక్కడే దారుణ హత్యకు, అత్యాచారానికి గురైన ఆదివాసి యువతి ఊకే శిరీష కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని తెలంగాణ స్టేట్ భీమ్ ఆర్మీ చీఫ్ సెక్రటరీ వాసాల శ్రీనివాస్ రావణ్ డిమాండ్ చేశారు. శిరీషపై జరిగిన దారుణ ఘటన తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.పేద, ఆదివాసి కుటుంబాలకు చెందిన యువతులు ఉపాధి కోసం పట్టణాలకు, నగరాలకు వెళ్లే పరిస్థితుల్లో వారి భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. శిరీష ఘటనపై అనుమానాలకు తావులేకుండా అన్ని కోణాల్లో సమగ్రంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని కోరారు. దర్యాప్తు పేరుతో వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అన్నారు.
నిందితుడు ఎవరైనా సరే చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి త్వరితగతిన న్యాయం అందేలా ప్రత్యేక న్యాయ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు పునరావృతం కాకుండా నిందితుల్లో భయం కలిగించేలా కఠిన చర్యలు ఉండాలని పేర్కొన్నారు.ఉద్యోగ ప్రదేశాల్లో మహిళల భద్రతపై యాజమాన్యాలు నిర్లక్ష్యం వహించకుండా ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయాలని అన్నారు. మహిళలు పనిచేసే సంస్థల్లో సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను తప్పనిసరి చేయాలని కోరారు.
శిరీష కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించాలని అన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.కోటి ఎక్స్గ్రేషియా, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పూర్తి సహాయం అందించాలని డిమాండ్ చేశారు.ఆదివాసి మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వాసాల శ్రీనివాస్ రావణ్ కోరారు. శిరీష కుటుంబానికి న్యాయం జరిగే వరకు తెలంగాణ స్టేట్ భీమ్ ఆర్మీ అండగా ఉంటుందని తెలిపారు.





























