Trending Now

గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే అర్హత బీజేపీకి లేదు..

పదేళ్లుగా గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చేసింది శూన్యం

నలుగురి బీజేపీ ఎంపీలు పార్లమెంటులో ఏమీ మాట్లాడలేదు

హైదరాబాద్, ప్రతి పక్షం స్టేట్ బ్యూరో: గల్ఫ్ దేశాలలో భారతీయ కార్మికులకు అక్కడ కంపెనీలు ఇస్తున్న కనీస వేతనాలను.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ  సెప్టెంబర్ 2020 లో రెండు సర్కులర్లను జారీ చేసి వలస శ్రామికులకు ద్రోహం చేసిందని, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే నైతిక అర్హత లేదని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్ అన్నారు. సోమవారం హైదరాబాద్ గాంధీ భవన్ లో ఆయన విలేఖరుల సమావేశంలో ప్రసంగించారు. 

గత ఐదేళ్లలో గల్ఫ్ సమస్యల గురించి తెలంగాణకు చెందిన నలుగురు బీజేపీ ఎంపీలు పార్లమెంట్ లో ఏమీ మాట్లాడలేదు. ప్రవాసి భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమాలో సహజ మరణాన్ని కూడా చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎందుకు పట్టించుకోలేదని కాంగ్రెస్ ఎన్నారై నాయకుడు నంగి దేవేందర్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో సౌదీ అరేబియా, కువైట్ దేశాల కాన్సులేట్లు (దౌత్య కార్యాలయాలు) ఏర్పాటు కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు పట్టించుకోలేదని విమర్శించారు. 

ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోదీ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో చాలా సార్లు పర్యటించారు. భారత్ – గల్ఫ్ దేశాల మధ్య చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలలో వ్యాపార వాణిజ్య ఒప్పందాలే ఎక్కువ. గల్ఫ్ వలస కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమం గురించి ఎందుకు  పట్టించుకోలేదని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి విమర్శించారు. కరోనా కష్టకాలంలో గల్ఫ్ తదితర దేశాల నుంచి భారత్ కు వాపస్ వచ్చిన ప్రయాణీకుల నుంచి రెండింతలు, మూడింతలు విమాన ఛార్జీలు వసూలు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద ప్రవాసి కార్మికులను దోచుకున్నదని ఆయన ఆరిపించారు. 

గత పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం ఎన్నారైల కోసం ఆన్ లైన్ ఓటింగ్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది. మోదీకి ఎన్నారైలు అంటే.. ఏదో తెలియని భయం పట్టుకున్నదని వారు అన్నారు. విదేశీ మారకద్రవ్యం పంపిస్తూ దేశానికి ఆర్థిక జవాన్లుగా పనిచేస్తున్న ప్రవాసులకు కేంద్రం అన్యాయం చేస్తోందనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. దీనికి బీజేపీ జవాబు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

Spread the love

Related News

Latest News