ప్రతిపక్షం, జూన్ 20: టిమ్స్ ఆసుపత్రుల్లో ప్రస్తుతం చేపడుతున్న వైద్యుల నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన జరుగుతున్నాయని వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు. రోగులకు వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు డిప్యుటేషన్ విధానంలో వైద్యులను నియమిస్తున్నామని తెలిపారు.
ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత కారణంగా తాత్కాలిక ఏర్పాట్లకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. అయితే త్వరలోనే సాధారణ నియామక ప్రక్రియ ద్వారా శాశ్వత పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. కొత్తగా ఎంపికైన వైద్యులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రస్తుతం డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు తిరిగి తమ అసలు ఆసుపత్రులకు వెళ్లనున్నారని వివరించారు.
డిప్యుటేషన్ విధానంలో వైద్యులను ఇతర ఆసుపత్రుల నుంచి తరలించడంపై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో డీఎంఈ ఈ వివరణ ఇచ్చారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, శాశ్వత నియామకాల ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
టిమ్స్ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల విస్తరణతో పాటు వైద్యులు, సిబ్బంది సంఖ్యను కూడా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. శాశ్వత నియామకాలు పూర్తయిన తర్వాత ఆసుపత్రుల సేవలు మరింత బలోపేతం అవుతాయని వైద్యశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

















