Trending Now

డీకే అరుణపై షాద్ నగర్ కాంగ్రెస్ నేతల ఫైర్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తెలంగాణలో కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు అండగా ప్రజా పాలన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అహంకార పూరితంగా విమర్శలు చేస్తూ వ్యక్తిగత దూషణలు చేస్తున్న బీజేపీ పార్లమెంటు అభ్యర్థి డీకే అరుణను గ్రామాల్లో తిరుగనివ్వమని తరిమికొడతామంటూ షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. నిన్న జరిగిన డీకే అరుణ ఎంపీ నవనీత్ కౌర్ రోడ్డు షో సందర్భంగా వారు మాట్లాడిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ఒక దశలో డీకే అరుణపై కూడా కాంగ్రెస్ నాయకులు నోటికి పని చెప్పారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదివాసి గిరిజన కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పి. రఘునాయక్, పీసీసీ సభ్యులు మహమ్మద్ అలీఖాన్ బాబర్, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, సీనియర్ నేత ఖాదర్ గోరీ మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి రమేష్ గౌడ్ అందె మోహన్ అజ్మత్ బాబా జయప్రకాష్ నారాయణ మనోహర్ గౌడ్ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రఘునాయక్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై వ్యక్తిగత దూషణలకు దిగిన డీకే అరుణ ఇది గద్వాల సంస్థానం అనుకుంటున్నారని విమర్శించారు. షాద్ నగర్ పర్యటనలో గద్వాల దొరసాని డీకే అరుణ తన ఇష్ట రాజ్యంగా విమర్శలు చేసి వెళ్లడం ఆమె సంస్కారానికి సరికాదని హితవు పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన కాలిగోటితో సమానం కాదని, నోట్లో ఫినాయిల్ పోసి కడిగినా మురికిపోదని అంటూ అనేక విషయాలను ఆమె ప్రస్తావించడం పట్ల తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీజేపీ మత అహంకారంతో మాట్లాడుతున్నారని పార్లమెంటు ఎన్నికల్లో వారి బలుపు దింపుతామని తీవ్రస్థాయిలో స్పందించారు.

తెలుగుదేశం హయాంలో, కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రిగా పనిచేసిన డీకే అరుణ పాలమూరు జిల్లాలో వలసలను పేదరికాన్ని ఆపారా? అని ప్రశ్నించారు. ఆంధ్ర పాలకులు నీటిని దొంగతనం చేస్తే పట్టించుకోలేదని అన్నారు. మాటికి ముందు అచ్చంపేటకు చెందిన రేవంత్ రెడ్డి అంటూ ఎక్కడి ప్రాంతం వాడు అన్నట్టు మాట్లాడుతుండడం సరికాదని అన్నారు. అచ్చంపేట చరిత్ర దొరసానికి తెలియదంటూ ఎద్దేవా చేశారు. రజాకారులను తరిమికొట్టిన నల్లమల్ల చరిత్ర ఒకసారి తెలుసుకోవాలని సూచించారు. నల్లమల్ల పులిబిడ్డ రేవంత్ రెడ్డిని విమర్శిస్తే తరిమికొడతామని హెచ్చరించారు. డీకే అరుణ ను గ్రామాల్లో రేవంత్ రెడ్డి అభిమానులు తిరగనివ్వబోరని హెచ్చరించారు.

గద్వాల సంస్థానంలో పెత్తనం చెలాయించిన దొరసాని అన్ని ప్రాంతాల్లో పెత్తనం చెలాయిస్తామంటే కుదరదని తాము కూడా ఎంతకైనా సమాధానం చెబుతామని అన్నారు. 60 లక్షల ఉద్యోగాలను ఖాళీ పెట్టిన ఘనత మోడీది కాదా? అని ప్రశ్నించారు. నాలుగు నెలలు అధికారంలోకి వచ్చిన తమపై అనేక నిందలు వేవడం సరికాదు అన్నారు. 6 గ్యారంటీల్లో ఎన్ని అమలు చేశామో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో డీకే అరుణ ఉన్నారని అన్నారు. అహంకారంతో మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మురికి నోరు ఎవరిదో ప్రజలందరూ చూస్తున్నారని ఎవరి సోకులు ఎలా ఉన్నాయో! తమకు తెలుసని రఘు అన్నారు. ఒక దశలో డీకే అరుణను ఉద్దేశించి ప్రచారంలో ఆ టోపీ ఆ కళ్లజోడు ఆ సోకులు ఏంటో అంటూ వ్యక్తిగతంగా రఘు విమర్శించారు. రేవంత్ రెడ్డిని విమర్శిస్తే డీకే అరుణను విడిచి పెట్టే ప్రసక్తే లేదని ఏ ఊరికి వెళ్లినా నిరసన తప్పదని హెచ్చరించారు. పాలమూరు ప్రజలు బుద్ధి చెప్పే ఘడియలు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.

ముస్లింలు లేకపోతే బీజేపీ లేదు..

ముస్లిం జాతి లేకపోతే భారతీయ జనతా పార్టీకి అధికారమే లేదని పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్ అన్నారు. అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ మాట్లాడిన వ్యాఖ్యలపై బాబర్ ఖాన్ స్పందించారు. కుల మతాలను అడ్డంగా పెట్టుకుని అడ్డంగా రాజకీయాల్లో పబ్బం గడుపుకునే నాయకులు బిజెపి వాళ్ళని విమర్శించారు. ఎప్పుడు ముస్లింలపై పడి ఏడుస్తూ అధికారాన్ని పొందుతున్నారని, ముస్లింలు లేకపోతే అసలు బీజేపీకి అధికారమే లేదంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పాకిస్తాన్ కు ఓటు వేసినట్టు చెబుతున్న నవనీత్ కౌర్ ఒకసారి వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలని హితవు పలికారు. మతాల మధ్య చిచ్చుపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్న బిజెపి నాయకులకు పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పుతామని బాబర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తప్పుడు ప్రచారం చేస్తున్న బిజెపి నాయకులను ప్రజలు క్షమించరని అన్నారు.

రేపు సాయంత్రం 5 గంటలకు రేవంత్ రెడ్డి రాక..

రేపు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ చౌరస్తాకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు దాదాపు 20 వేల మందితో భారీ ఎత్తున రోడ్డు షో కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

Spread the love

Related News