బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం..
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటకు ఇచ్చింది ఏమీ లేదు..
బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి
ప్రతిపక్షం, సిద్దిపేట, మే 03: భారతీయ జనతా పార్టీకి ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు ఖాయమని సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అన్ని అబద్ధాలే అని కొట్టిపారేశారు. సిద్దిపేట అభివృద్ధి కేంద్రం ఇచ్చిన నిధులతోనే జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి సీఎం స్థాయిని మరిచి మోడీ నీ విమర్శించడం సరికాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సిద్దిపేటకు రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు ఇచ్చాడని ఎద్దేవా చేశారు. జిల్లాలో సుమారు రూ.5 వేల కోట్ల నిధులతో జాతీయ రహదారులు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. సిద్దిపేటకు ఎన్నో ఏండ్ల రైలు కల సాకారం చేసింది మోడీ కాదా..? రేవంత్ రెడ్డి అని నిలదీశారు.
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల ద్వారానే రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుంది తప్ప రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చాలేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారని అరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు అడిగే నైతికత లేదన్నారు. మోడీ రాజ్యాంగాన్ని మార్చాలి అనుకుంటే ఇప్పటికే మార్చేవారని, రేవంత్ రెడ్డి ఓట్ల కోసం ప్రజలను మభ్యపెడుతున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ ను ప్రజలు పందేండ్ల లలో తిరస్కరిస్తే.. రేవంత్ రెడ్డి పది నెలల్లోనే తిరస్కరణకు గురవుతాడన్నారు. ఎన్ని నాటకాలు ఆడిన బీజేపీ గెలుపును ఎవరు ఆపలేరన్నారు. ప్రజల దీవెనలతో భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుస్తున్నాడని మోహన్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో ఉపేందర్ రావ్, కోడూరి నరేష్, నీలం దినేష్, కొత్తపల్లి వేణుగోపాల్, సురేష్ గౌడ్, గోనె మార్కండేయులు, తొడుపునూరి వెంకటేశం, సంతోష్, నవీన్ రెడ్డి, రాజు, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.