ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుల శివకుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన నిన్న క్యూలో వెళ్లకుండా నేరుగా వెళ్లటాన్ని ప్రశ్నించిన ఓటరుపై చేయ్యి చేసుకున్నారు. ఓటరు కూడా తిరిగి ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటనపై బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదుతో పోలీసులు FIR నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఏడుగురు తనపై దాడి చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అసలు ఏమి జరిగింది..
గుంటూరు జిల్లా తెనాలిలోని ఓటు వేయడానికి వెళ్లిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తన నియోజకవర్గం పరిధిలోని ఐతానగర్లో ఓటు వేసేందుకు వెళ్లారు. క్యూలైన్‌లో కాకుండా నేరుగా ఓటు వేయడానికి వెళ్తుండటాన్ని ఓ ఓటరు గమనించాడు. ఎమ్మెల్యే నేరుగా వెళ్లడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. క్యూ లైన్‌లో రావాలని డిమాండ్ చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ రెచ్చిపోయారు. నేరుగా ఓటరు దగ్గరకు వెళ్లి చెంపపై ఓ దెబ్బకొట్టారు. ఓటర్ సైతం తిరిగి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంపపై కొట్టారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఓటర్పై విచక్షణారహితంగా దాడి చేశారు.ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయి ఓటరుపై పిడిగుద్దుల వర్షం కురిపించారు.