లీడర్లకు కాంగ్రెస్ షేక్ హ్యాండ్
పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్ననేతలు
ప్రతిపక్షం, షాద్ నగర్, మే 9: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కారెక్కేందుకు ఏ రేంజ్‌లో అయితే వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు స్పీడ్ చూపించారో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో.. ఇప్పుడు అదే స్పీడ్‌తో కారులోంచి దూకేసి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నాయకులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు గేట్లు తెరవడంతో షాద్ నగర్ లో కొంతమంది నాయకులు, కార్యకర్తలు కారు దిగి కాంగ్రెస్‌లోకి పరుగులు తీస్తున్నారు. లోక్ సభ ఎన్నికలను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పార్టీలోకి వలసలను ప్రోత్సాహిస్తున్నారు.
షాద్ నగర్ కాంగ్రెస్ లో జోష్..
రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి ఊపుమీదున్న కాంగ్రెస్ లోకి చేరికల ప్రభావం మొదలైంది.లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో చేరికలను ఆహ్వానించాలని అధిష్టానం ఆదేశాలతో షాద్ నగర్ లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి లు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు కండువాలు కప్పుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ ను బలోపేతం చేస్తున్నారు. గులాబీ పార్టీ నేతలు కాంగ్రెస్ లోకి గుంపులుగా వెళ్లిపోతున్నారు. చిన్నా పెద్దా, సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా ఆపరేషన్ ఆకర్ష్‌తో లీడర్లందరికి షేక్ హ్యాండిస్తున్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. మీ భవిష్యత్తుకు మా భరోసా అంటూ వచ్చిన వారికి వచ్చినట్లు కండువా కప్పేస్తున్నారు. ఎంపీ ఎన్నికలకు సమయం సమీపించడంతో ఎట్టి పరిస్థితిలో నియోజకవర్గంలో సత్తా చాటేందుకు కాంగ్రెస్ సర్వ శక్తులు ఒడ్డుతుంది. గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన చాలా మంది నేతలు బ్యాక్ టూ పెవిలియన్ అంటూ మళ్ళీ కాంగ్రెస్ కి స్నేహహస్తం అందిస్తున్నారు.