మక్తల్, ప్రతిపక్షం: సంగంబండ ప్రాజెక్టు నీళ్లకు అడ్డుగా ఉన్న బండను తొలగించి, కాల్వల ద్వారా నీళ్లందిస్తామని సంగంబండ ప్రాజెక్టు రైతులకు డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క మల్లు, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం నారాయణపేట జిల్లా మక్తల్‌లోని సంగంబండ ప్రాజెక్టును మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. సాగునీరు లేక ఎండిపోయిన పంటలు చూస్తే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. లో లెవల్ కాలువకు అడ్డంగా ఉన్న బండను తొలగించి పొలాలకు నీరందిస్తామని హామీ ఇచ్చారు.
నారాయణపేట జిల్లాలోని సంగంబండ ప్రాజెక్టును మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి పరిశీలించారు. లోలెవల్ కెనాల్‌లో కాలువకు అడ్డంకిగా ఉన్న బండను పరిశీలించిన మంత్రులు అనంతరం సంగంబండ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాదీవెన సభలో పాల్గొన్నారు. సంగంబండ లో లెవల్ కెనాల్ పూర్తికి బండ అడ్డంగా ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. అడ్డంకిగా ఉన్న 500 మీటర్ల బండను తొలగిస్తామని చెప్పారు. భీమా ఎత్తిపోతల కింద పరిహారం, పునరావాస సమస్యలు పరిష్కరిస్తామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మక్తల్ నుంచి వచ్చే అన్ని ప్రతిపాదనలను ఆమోదిస్తామని హామీ ఇచ్చారు. కనీవినీ ఎరుగని రీతిలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా పైసల కోసం ప్రాజెక్టులు చేపట్టిందని ఆరోపించారు.
ఐదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి, భీమా, కోయల్‌సాగర్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామని అన్నారు. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పేర్కొన్నారు. వంశీచంద్‌రెడ్డి ఎంపీ అయితే పాలమూరు మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజల జీవితాల్లో ఆయన వెలుగులు నింపుతారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు.
సంగంబండ లోలెవల్ కెనాల్ వద్ద బండను పగలగొడతామని మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బండను తొలగిస్తే 20,000ల ఎకరాలకు నీళ్లు అందుతాయని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. రూ.12 కోట్లు ఖర్చు చేసి బండ తొలగిస్తే 20,000ల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చని తెలిపారు. ఇక్కడి ప్రాంతాన్ని ఎకో టూరిజం కింద అభివృద్ధి చేస్తామని, సంగంబండ ఖాళీ భూముల్లో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే శ్రీహరి కష్టపడుతున్నారని భట్టి విక్రమార్క వెల్లడించారు.
“వంశీచంద్‌రెడ్డిని గెలిస్తే మహబూబ్‌నగర్‌కు రూ.వందల కోట్లు నిధులు తెస్తారు. ఉమ్మడి పాలమూరుకు నిధులు తెచ్చేందుకు వంశీచంద్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకునే నాయకుడు వంశీచంద్‌రెడ్డి. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని కోరుకునే నాయకుడు. వంశీచంద్ ఎంపీ అయితే ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఉంది ” – అని భట్టి విక్రమార్క తెలిపారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి నదులు, ప్రాజెక్టులపై మంచి అవగాహన ఉందని భట్టి విక్రమార్క అన్నారు. సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడు జలవనరుల మంత్రి కావడం మన అదృష్టమని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో పేదలకు 3,500 ఇళ్లు కట్టిస్తామని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉంటే 200 యూనిట్ల లోపు కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదని, ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేయాలని కోరుతున్నామని భట్టి విక్రమార్క వివరించారు.