ఆరుగురితో రోదసిలోకి పయనం
తిరిగి విజయవంతంగా భూమి మీదకు
అంతరిక్షంలోకి తొలి తెలుగు ఆస్ట్రోనాట్
తోటకూర గోపీచంద్ కు అరుదైన అవకాశం
90 యేళ్ల వయసులో సాహసం చేసిన ఎడ్ డ్వైట్
రికార్డులు సృష్టిస్తున్న అమెజాన్ అధినేత సంస్థ
టెక్సాస్ (అమెరికా) మే 19: అమెరికాలో నివాసం ఉంటున్న తెలుగు తేజం తోటకూర గోపీచంద్ అరుదైన రికార్డును సృష్టించారు. అంతరిక్షంలోకి ప్రవేశించిన తొలి తెలుగువాడిగా చరిత్ర పుటలకు ఎక్కారు. అమెజాన్ వ్యవస్థాపకుడు, అమెరికాకు చెందిన బిలియన్ జెఫ్ బెజోస్ కు చెందిన ‘బ్లూ ఆరిజన్’ చేపట్టిన అంతరిక్ష ప్రయోగం ఆదివారం విజయవంతం అయ్యింది. వీరు ప్రయోగించిన అంతరిక్ష నౌక ’న్యూ షెఫర్డ్–25’ అమెరికాలోని పశ్చిమ టెక్సాస్ నుంచి ఆరుగురు ప్రయాణికులతో రోదసిలోకి దూసుకు వెళ్లింది. వారు అక్కడ కొద్ది సేపు గడిపిన తరువాత అంతరిక్ష నౌక విజయవంతంగా భూమి మీదకు తిరిగి వచ్చింది. ఈ అంతరిక్ష ప్రయాణంలో గోపీచంద్ తో పాటు అమెరికాకు చెందిన తొలి నల్ల జాతీయ వ్యోమగామి ఎడ్ డ్వైట్, వెంచర్ క్యాపిటలిస్ట్ మాసన్ ఏంజెల్, పారిశ్రామిక వేత్తలు సిల్వియన్, కారోల్ షెల్లర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కెన్నెత్ ఉన్నారు. విశేషమేమిటంటే నల్ల జాతీయ వ్యోమగామి 90 యేళ్ల వయసులో ఈ సాహసానికి పూనుకోవడం. ఆయనకు 1961 లోనే అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం వచ్చింది. కానీ, కుదరలేదు. 1984లో భారతదేశం నుంచి రాకేష్ శర్మ అంతరిక్ష యానం చేశారు. అప్పటి ప్రధాని ఇందిరతో మాట్లాడుతూ ‘సారే జహాసే అచ్ఛా హిందుస్థాన్’ హమారా అని నినదించారు. ఆ తర్వాత కల్పనా చావ్లా, సునీత విలియమ్స్, రాజాచారి, శిరీష బండ్ల తదితరులు అంతరిక్ష యానానికి పూనుకున్నారు. వీరంతా భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లిన వారే. గోపీచంద్ కూడా ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నప్పటికీ భారతీయ పౌరుడిగా కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ గోపీచంద్ జన్మస్థలం. కాగా, బ్లూ ఆరిజన్ సంస్థ మానవ సంహిత అంతరిక్ష యానం చేపట్టడం రెండేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. మొత్తంగా ఏడుసార్లు ఈ సంస్థ అంతరిక్ష నౌకను రోదసిలోకి పంపించింది.