ప్రతిపక్షం, వెబ్‌డెస్క: సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాకారంలో సమ్మక్క సారక్క తాత్కాలిక ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. 335 ఎకరాలకు గాను, 50 ఎకరాలు ఇంకా భూసేకరణ జరగాల్సి ఉందన్నారు. పూర్తిస్థాయిలో భూసేకరణ కాగానే యూనివర్సిటీ భవనాల శాశ్వత నిర్మాణం చేపడతామన్నారు. సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీకి హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీ మెంటర్‌గా పనిచేస్తుందన్నారు. ఆర్కియాలాజికల్ డిపార్ట్మెంట్ ద్వారా 7 కోట్ల రూపాయలుతో పాటు, రాష్ట్ర ప్రభుత్వానికి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా 60 కోట్ల రూపాయలు అప్పగించి అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో 35 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించేలా చూస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.