President’s Rule Revoked In JK: జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. ఈ మేరకు కేంద్రం గెజిట్ విడుదల చేయగా.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ కొత్త ప్రభుత్వ పాలన దిశగా అడుగులు వేస్తున్నందున రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి విజయం సాధించగా.. ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో కేంద్ర పాలిత ప్రాంతంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం రాష్ట్రపతి పాలన రద్దు చేశారు. కాగా, జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన 2019 ఏడాది అక్టోబర్ 31న విధించగా.. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఎత్తివేశారు. ఇదిలా ఉండగా, ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉన్న సమయంలో 2009 నుంచి 2014 సమయంలో ఎన్సీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి సీఎంగా పనిచేశారు. పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి మళ్లీ విజయం సాధించింది.