రేపటి నుంచి భూముల ధరల పెంపు: మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రతిపక్షం, జూన్ 04: తెలంగాణలో భూముల మార్కెట్ విలువలను జూన్ 5 నుంచి పెంచుతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రాంతాన్ని బట్టి భూముల విలువలు 50 శాతం నుంచి 100 శాతం వరకు పెరగనున్నాయని తెలిపారు. ప్రైమ్ ఏరియాల్లో గరిష్ఠంగా 100 శాతం పెంపు ఉండనుందని వెల్లడించారు.

భూముల మార్కెట్ విలువల సవరణతో రాష్ట్ర ఖజానాకు అదనంగా రూ.1,200 నుంచి రూ.1,400 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. అయితే శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఖాజాగూడ వంటి అధిక విలువ కలిగిన ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం ప్రస్తుతం ఆలోచించడం లేదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సబ్-రిజిస్ట్రార్‌ల అధికారాలను పరిమితం చేసినట్లు మంత్రి వెల్లడించారు. రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు చర్యలు తీసుకున్నామని, ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అదేవిధంగా, త్వరలో తహసీల్దార్ల బదిలీలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును రద్దు చేసే ఆలోచన లేదని స్పష్టం చేసిన మంత్రి, రాష్ట్రంలో 90 శాతం గ్రామాల భూ సర్వే పనులు వచ్చే ఏడాదిన్నరలో పూర్తి అవుతాయని తెలిపారు.

Spread the love

Related News

Latest News