ప్రతిపక్షం, జూలై 08: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద భారీ ఎత్తున నిధులు విడుదల చేయడాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 72.58 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.8,000 కోట్ల రైతు భరోసా నిధులను నేరుగా జమ చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలులో భాగంగానే రైతు భరోసా నిధులను పారదర్శకంగా రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రైతుల ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ రంగ బలోపేతమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా రైతు సంక్షేమ కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు.

















