ప్రతిపక్షం, జూన్ 25: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. ఎస్టీ రిజర్వేషన్ల కల్పనలో ఇందిరా గాంధీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఎస్టీ రిజర్వేషన్లు లేకపోతే అనేక మంది ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల్లో ఉన్నత హోదాల్లో ఉండే అవకాశం లభించేదా అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక సోనియా గాంధీ కృషి ఉందని గుర్తుచేసిన ఆయన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. రాహుల్ గాంధీ ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కుల సర్వే నిర్వహించామని తెలిపారు.
బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించిన మహేష్ కుమార్ గౌడ్, ఆ పార్టీ రాజకీయ ప్రభావం ముగిసిపోయిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద స్థానాలకు పైగా గెలిచి మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన, పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ గృహాల వంటి పథకాల ద్వారా పేదలకు గృహ వసతి కల్పించే దిశగా కృషి జరిగిందన్నారు.
రానున్న కార్యక్రమాలు, యాత్రల్లో పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు చురుకుగా పాల్గొని ప్రజల్లోకి వెళ్లాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.





















