Trending Now

అబద్దపు పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌..

  • పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

ప్రతిపక్షం, రామగిరి (మంథని), ఏప్రిల్ 06 : ఆసాద్యపు హమీలు, ఉచిత పథకాల ప్రకటించి కాంగ్రెస్‌ అబద్దపు పునాదులపై అధికారంలోకి వచ్చిందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పిలుపులో బాగంగా ఈ యాసంగి సీజన్ నుండే ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేలు నష్టపరిహారం చెల్లించాలని శనివారం మంథని ప్రధాన చౌరస్తాలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో డిమాండ్ చేస్తూ రైతన్నలకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 76ఏండ్ల స్వాతంత్య్రంలో అధిక కాలం పరిపాలన అందించిన కాంగ్రెస్‌ ఆనాటి నుంచి ఈనాటి వరకు అబద్దాలు, మోసాలతో అధికారంలోకి వచ్చి దేశాన్ని చీకట్లోకి నెట్టివేసిందన్నారు. పథకాల ఆశ చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ అదే ఆశలో ప్రజలు బతుకాలన్నదే కాంగ్రెస్‌ ఉద్దేశ్యమని ఆయన అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి అనేక విధాలుగా ముందుకు సాగుతున్న క్రమంలో సైతం కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను ఏదో ఒక రూపంలో మోసం చేస్తూనే వస్తుందన్నారు.

చీకటి, మోసానికి నిలువెత్తు నిదర్శనంగా కాంగ్రెస్‌పార్టీ నిలుస్తుందని ఆయన విమర్శించారు.గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన కమ్యూనిస్టులు, ప్రజాస్వామ్య వాదులు ఈనాడు ప్రభుత్వ విధానాలను చూసి బిత్తెర పోతున్నారని, వారి పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలుకలా తయారైందన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి తెలంగాణా సాధించిన మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నానా దుర్బాషలాడాడని, కనీసం వయస్సు, హోదాకు కూడా గౌరవం ఇవ్వడంలేదన్నారు. ఆనాడు రెండు పంటలకు రైతుబంధు ఇస్తున్నారు మూడో పంటకు ఇవ్వరా అని ఎగతాలి చేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనాడు ఒక్క పంటకు కూడా సరిగ్గా రైతుబంధు ఇవ్వలేదని ఆయన అన్నారు. మంథని నియోజకవర్గంలో సాగునీరు లేక పంటలు ఎండిపోయి రైతులు కన్నీరు పెట్టుకుంటుంటే స్థానిక ఎమ్మెల్యే మాత్రం పట్టించుకోవడం లేదని, గత జూలై అగస్టు మాసాల్లో బారీ వర్షాలు కురిసి వరదలు వచ్చిన విషయాన్ని మరిచి అసలు వర్షాలు కురియలేదని చెబుతున్నాడని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటక వాసులు తాము మోసపోయి గోసపడుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీవి అబద్దాల హమీలను మొత్తుకున్నా మనం పట్టించుకోలేదని అన్నారు.

కర్ణాటక, తెలంగాణను కాంగ్రెస్‌ పార్టీ ఎలా మోసం చేసిందో అదే రీతిలో పార్లమెంట్‌ ఎన్నికల్లో దేశాన్ని మోసం చేయాలని చూస్తుందని అన్నారు. ఈనాడు రైతులు పంటలు ఎండిపోయి ఏడుస్తుంటే ముఖ్యమంత్రి ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూస్తున్నాడని ఆయన విమర్శించారు. కనీసం కాలువల ద్వారా సాగునీరు అందించాలని ఆలోచన చేయడం లేదని, మంథని ప్రాంతంలోని నాయకులు మాత్రం వంతుల వారిగా కమీషన్‌ల కోసం తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. రైతులు ఇలాంటి ఇబ్బందులు పడితేనే మళ్లీ ఎన్నికల్లో తమ మాట వింటారని కాంగ్రెస్‌ పార్టీ బావిస్తోందని అన్నారు. అన్ని ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వాన్ని పక్కన పెట్టి మోసం చేసే కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వబట్టే రైతులు గోసపడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు రైతులు ఆలోచన చేయాలని, కాంగ్రెస్‌ మోసం, అబద్దాలను అర్థం చేసుకోవాలని ఆయన హితవు పలికారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Spread the love

Related News