Trending Now

హీటెక్కిస్తున్న ఓరుగల్లు ఎంపీ సీటు..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: వరంగల్ ఎంపీ ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. కాంగ్రెస్, BRS, BJP ఓరుగల్లు సీటును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే.. ఎలాగైనా వరంగల్‌లో పాగా వేయాలని.. కాంగ్రెస్, బీజేపీ చూస్తున్నాయి. ఇప్పటికే వరంగల్ ఎంపీ టికెట్‌ను BRS.. కడియం కావ్యకు కేటాయించింది. జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మాత్రం.. అభ్యర్థి కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి.

నిన్నటి వరకు బీజేపీలో చేరతారనుకున్న ఆరూరి రమేష్‌ యూ టర్న్ తీసుకోవడంతో.. బలమైన అభ్యర్థిని బరిలో దించే యోచనలో ఉంది కమలం పార్టీ. రిటైర్డ్ IPS కృష్ణప్రసాద్, మాజీ మంత్రి విజయరామారావు పేర్లను పరిశీలిస్తోంది బీజేపీ అధిష్ఠానం. ఎస్సీ రిజర్డ్వ్ సీటు కావడంతో.. వరంగల్‌లో అత్యధికంగా ఉండే మాదిగ సామాజికవర్గం నుంచి అభ్యర్థిని దించాలని చూస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేకున్నా.. కేడర్ బలంగా ఉండటంతో.. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి వస్తుందని భావిస్తోంది కమలం పార్టీ. ఆరూరి యూ టర్న్ తీసుకోవడంతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన KMC అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుజాత బీజేపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారు డా.సుజాత.

అటు కాంగ్రెస్ కూడా.. వరంగల్ ఎంపీ స్థానాన్ని దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. మాదిగ సామాజిక వర్గం నుంచి బలమైన నేతను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. టిక్కెట్‌ రేసులో దొమ్మటి సాంబయ్య, రామగల్ల పరమేశ్వర్, హరికోట్ల రవి ఉన్నారు. మరోవైపు.. పొత్తులో భాగంగా.. వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని CPI డిమాండ్ చేస్తోంది. వరంగల్ సీటును సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌ను కాదని, కడియం కూతురికి ఇవ్వడంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పసునూరితో కాంగ్రెస్ ముఖ్యనేతలు మంతనాలు జరిపినట్లు సమాచారం. కాంగ్రెస్ గూటికి ఎంపీ పసునూరి చేరతారని ప్రచారం జరుగుతోంది. బీజేపీకి టచ్‌లోకి వెళ్లిన ఆరూరికి ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్ఠానం నచ్చజెప్పింది. ఎంపీ పసునూరిని కూడా బీఆర్ఎస్ బుజ్జగిస్తోంది.

Spread the love