Trending Now

‘మహా’ జాతరకు సర్వం సిద్ధం.. మేడారంలో భక్తుల కిటకిట

మేడారం, ప్రతిపక్షం ప్రత్యేకప్రతినిధి: నేటి నుంచి ‘మహా’జాతర ప్రారంభం కానుంది. కోటి మందికిపైగా హాజరయ్యే మహా కుంభమేళా, ఆదివాసీ గిరిజన మహా జాతరకు వచ్చే భక్తులకు వనం నుంచి జనంలోకి వచ్చి దర్శనం ఇచ్చే సమయం ఆసన్నమైంది. అందులో మొదటి ఘట్టమైన సమ్మక్క భర్త పగిద్దరాజు పెళ్లికుమారునిగా ముస్తాబై మంది మర్బలంతో మహబూబాబాద్ జిల్లా నుంచి ములుగు జిల్లా మేడారానికి బయలుదేరిన అపురూప ఘట్టం నెలకొంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఆదివాసుల జనజాతర ప్రారంభం కాబోతోంది.

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజును పెనుక వంశస్తులు పెళ్లి కుమారునిగా ముస్తాబు చేసి పడగ రూపంలో అటవీ మార్గంలో మేడారానికి తీసుకొస్తున్నారు. అంతకు ముందు గ్రామ ప్రజలంతా తమ ఇళ్లను పుట్టమట్టితో అలికి ముగ్గులు వేసుకోని అందంగా తయారు చేసుకున్నారు. స్వామి వారిని కుంకుమ భరిణ రూపంలో పెనుకవారి ఇంటి నుంచి ఆలయానికి తీసుకొచ్చారు.అనంతరం స్వామివారిని పడగరూపంలో అలంకరించి ఆలయంలో పూజలు నిర్వహించారు.

శివసత్తుల పూనకాలతో డోలు వాయిద్యాలతో స్వామివారిని గ్రామంలో ఊరేగించారు. అనంతరం స్వామివారి ప్రతిమతో మేడారానికి అటవీ మార్గంలో కాలినడకన బయలుదేరారు. దాదాపు 70 కిలో మీటర్లు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉండగా మంగళవారం కార్లపెల్లి, గుండ్లవాగు మీదుగా రాత్రి గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ పెనుక వంశస్తుల ఇంట్లో బసచేసి బుధవారం ఉదయం మళ్లీ అక్కడి నుంచి బయలుదేరుతారు. రాత్రిలోపు మేడారంలోని సమ్మక్క ఆలయానికి చేరుకుంటారు. కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవింద రాజులు సైతం మేడారంలోని సమ్మక్క ఆలయానికి చేరుకుంటారు.

అక్కడ ముగ్గురు దేవతల పూజారులంతా కలిసి పూజలు చేసి దేవుళ్లను రాత్రి చంద్ర గ్రహణం ముగిశాక గద్దెలపై ప్రతిష్ఠిస్తామని పూజారులు తెలిపారు. ఫిబ్రవరి 22వ తేదీన వనదేవత సమ్మక్కను అధికార లాంఛనాలతో తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించడం జరుగుతుందని, 23న, 24వ తేదిన సాయంత్రం వరకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని పూజారులు తెలిపారు. 24వ తేదీన సాయంత్రం తల్లులను తిరిగి వనప్రవేశం చేయిస్తామని చెప్పారు. దీంతో మేడారం జాతర ముగుస్తుందని తెలిపారు.

భక్తులకు స్వచ్ఛంద సహాకారం..

వనదేవతల దర్శనానికి తరలివెళ్లే భక్తులకు దాతలు అండగా నిలుస్తున్నారు. త్రాగునీరు ఆహారం అందిస్తూ సమ్మక్క సారలమ్మ వనదేవతల సేవలో తరిస్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లా వర్ధన్నపేట మీదుగా ఆర్టీసీ బస్టాండ్​లో మేడారం జాతరకు వెళ్తున్న భక్తులకు ఓ ఇన్​ఫ్రా సంస్థ భోజనం, త్రాగునీరు సౌకర్యాన్ని కల్పించింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కె. ఆర్ నాగరాజు ప్రారంభించారు. మేడారం వెళ్లే భక్తులకు ఎవరికితోచిన విధంగా వారు కొంత సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు విజ్ఞప్తి చేశారు.

Spread the love

Latest News