ప్రతిపక్షం, జూన్ 06: హైదరాబాద్‌లో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదల కోసం లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. నగర పరిధిలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో నివసిస్తున్న ప్రజలకు వారి ప్రస్తుత నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఈ ఇళ్లను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉపాధి, విద్య, రవాణా వంటి సౌకర్యాలకు ఇబ్బంది కలగకుండా ఇళ్ల నిర్మాణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు.
క్యూర్ పరిధిలో లక్ష ఇళ్లతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మరో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. మొత్తంగా 3.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోందని పేర్కొన్నారు.
పేదల జీవన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇళ్ల నమూనాలను రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ప్రతి ఇంటిలో తగిన గదులు, పారిశుద్ధ్య సదుపాయాలు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ వంటి మౌలిక వసతులు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం గృహహీనులకు శాశ్వత నివాస సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వేలాది పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
















