ప్రతిపక్షం, జూలై 09: మాజీ మంత్రి హరీశ్ రావు మూడు నెలల పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు అప్పగిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించి చూపిస్తానని చేసిన సవాల్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరితే మంత్రి పదవి అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడతానని వ్యాఖ్యానించారు.
మూడేళ్లపాటు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి ప్రస్తుతం సమస్యలు ఎదుర్కొంటున్న కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన వ్యక్తి ఇప్పుడు మూడు నెలలు బాధ్యతలు ఇస్తే పరిస్థితి మార్చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. మంత్రి పదవి అంటే పిల్లలాట కాదని, హరీశ్ రావు కొత్త రాజ్యాంగం రాస్తున్నారా అంటూ విమర్శలు గుప్పించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, రాజకీయ విమర్శల కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని జగ్గారెడ్డి పేర్కొన్నారు.


















