ప్రతిపక్షం, జూన్ 30: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా వెదుళ్లవలస గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లే తన ఇద్దరు చిన్నారుల గొంతులను కత్తితో కోసి దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిన్నారులను హత్య చేసిన అనంతరం తల్లి కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ఆమెను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనకు కుటుంబ కలహాలా, మానసిక ఒత్తిడా లేదా మరే ఇతర కారణాలా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు, స్థానికులను ప్రశ్నించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
ఇద్దరు అమాయక చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనకు గల అసలు కారణాలు పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది.
















