ప్రతిపక్షం, జూన్ 29: రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) ద్వారా చేపట్టనున్న భారీ రోడ్ల నిర్మాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పైలాన్ ఆవిష్కరించి శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ ఆధ్వర్యంలో రూ.13,060 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 34 ప్యాకేజీల కింద మొత్తం 441 రహదారులను విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 6,092 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధి చేపట్టనున్నారు.
పైలాన్ ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రహదారుల విస్తరణతో రాష్ట్రంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రాంతీయ అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధికి ఊతం లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.


















