ప్రతిపక్షం, హైదరాబాద్, మే 8 : దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఎండోమెంట్ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఎండోమెంట్ కమీషనర్ కార్యాలయంలో శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎండోమెంట్ కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ హనుమంత రావు తో పాటు పలువురు అడిషనల్ కమీషనర్లు, జాయింట్ కమీషనర్లు, అసిస్టెంట్ కమీషనర్లు, ప్రధాన దేవాలయాల కార్యనిర్వాహక అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ ఆదీనంలో ఉన్న దేవాలయాల భూముల వివరాలను సేకరించి ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ఇదివరలో అన్యాక్రాంతమైన దేవాలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలలో సందర్శించే భక్తులకు తగు మౌళిక సదుపాయాలు, త్రాగు నీరు, గ్రీన్ మ్యాట్స్ , కార్పెట్స్, భక్తులకు ఎండా ప్రభావం తగలకుండా చలువ పందిళ్ళు ఏర్పాటు చేయాలని ఆమె అధికారులకు సూచించారు. దేవాలయాలకు చెందిన నిధులు దుర్వినియోగం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు.