Trending Now

‘కేసీఆర్ పై సమగ్ర విచారణ జరపాలి’

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: కేసీఆర్ పై సమగ్ర విచారణ జరపాలని సీఎం రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ కోరారు. తెలంగాణలో ఐదారు నెలల తర్వాత కాంగ్రెస్ సర్కారు ఉండదని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదని ఆయన ఖండించారు. హైదరాబాద్ లో మంగళవారం ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనలు చేస్తున్న కేసీఆర్ పై సమగ్ర విచారణ జరపాలన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చాలామంది కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారన్న సంగతి తెలుసుకొని, వారు పార్టీ నుంచి వెళ్లిపోతారనే భయంతోనే, నిస్సహాయ పరిస్థితుల్లోనే కేసీఆర్ పైకి బీరాలు పలుకుతున్నాడని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు మాత్రమే ఫైనల్ అనే విషయాన్ని మాజీ సీఎం కేసీఆర్ మరిచిపోతే ఎలా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్దంగా పూర్తి మెజారిటీతో ఏర్పాటై, ప్రజా రంజకంగా పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ఎలా పడగొడతారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ కు ఉన్న సంఖ్యాబలం, ప్రజాబలం చూస్తే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని గుర్తు చేశారు. అయితే, కేసీఆర్ ఇంకా తానే సీఎం అనే భ్రమల్లో ఉన్నాడని, తమ కుటుంబం అక్రమంగా సంపాదించిన డబ్బుతో కేసీఆర్ ఓ సినిమా తీసి, అందులోనైతే తానే సీఎం పాత్రలో నటించవచ్చు కదా.. అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే కేసీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి కూడా పాల్గొన్నారు.

Spread the love