గోదావరి పుష్కరాలకు ప్రత్యేక కార్యాచరణ.. హుస్నాబాద్‌ను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతాం: పొన్నం ప్రభాకర్

ప్రతిపక్షం, జూన్ 11: రాబోయే 2027 గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బస్టాండ్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

గోదావరి పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో రహదారులు, రవాణా, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటికే వివిధ శాఖల సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

నాలుగు జిల్లా కేంద్రాలకు అనుసంధానంగా ఉన్న హుస్నాబాద్ పట్టణం అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఫోర్‌లైన్ రహదారులతో అనుసంధానమైన ఈ పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. పెరుగుతున్న జనాభా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.

హుస్నాబాద్‌ను విద్య, వైద్యం, పర్యాటకం, పరిశ్రమల రంగాల్లో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఇంజినీరింగ్ కళాశాలలు, వైద్య విద్యా సంస్థలు, పర్యాటక ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్‌ల ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

హుస్నాబాద్ బస్టాండ్ రాష్ట్రంలోనే కీలక రవాణా కేంద్రంగా ఎదుగుతోందని పేర్కొన్న మంత్రి, ప్రతిరోజూ సుమారు 35 వేల మంది ప్రయాణికులు ఈ బస్టాండ్‌ను వినియోగిస్తున్నారని తెలిపారు. ప్రయాణికుల సంఖ్య, ఆదాయం పరంగా కూడా ఇది ముందంజలో ఉందన్నారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు బస్టాండ్‌ను ఆధునిక వాణిజ్య సముదాయంగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.

బస్టాండ్‌లో ప్రయాణికుల కోసం విశ్రాంతి గదులు, పారిశుద్ధ్య సదుపాయాలు, తాగునీటి వసతి, వాణిజ్య దుకాణాలు, ఆధునిక సాంకేతిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హుస్నాబాద్‌ను భవిష్యత్తులో అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News