ప్రతిపక్షం, జూలై 14, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో రాష్ట్రానికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, నిధుల సాధనలో ఎంపీలు కీలక పాత్ర పోషించాలని సీఎం కోరారు. హైదరాబాద్‌లో భారతీయ నిర్వహణ సంస్థ (ఐఐఎం) ఏర్పాటు కోసం కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి అవసరమని, ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి మద్దతు కోరాలని సూచించారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణ పనులు వేగవంతం కావడానికి కేంద్రంతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎస్‌బీఐ క్యాప్స్‌ను కన్సల్టెంట్‌గా నియమించేందుకు కేంద్రం అంగీకరించిందని, తదుపరి ప్రక్రియ వేగవంతం చేసేందుకు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో 95 శాతం భూసేకరణ పూర్తైందని, పనుల ప్రారంభానికి కేంద్ర మంత్రివర్గ ఆమోదం అవసరమని తెలిపారు. అలాగే దక్షిణ భాగం భూసేకరణకు కూడా కేంద్రం నుంచి అనుమతులు త్వరితగతిన వచ్చేలా ఎంపీలు కృషి చేయాలని కోరారు.
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు తొలి దశ టెండర్ల దశకు చేరుకుందని, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్రం నుంచి ఆమోదం పొందేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో సమన్వయం చేయాలని సూచించారు.
అంతర్రాష్ట్ర జలాల అంశంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు ఎంపీలు చొరవ చూపాలని సీఎం కోరారు. తుంగభద్ర డ్యామ్‌లో పూడిక తొలగింపు, గోదావరి-నాగార్జునసాగర్ అనుసంధానం, ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు అదనపు నీటి కేటాయింపులు, గోదావరి-కావేరి అనుసంధానం వంటి కీలక అంశాలపై కేంద్ర జలశక్తి శాఖతో సమన్వయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన పలు ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీలు) ఇవ్వాల్సి ఉందని, ఈ అంశాన్ని కూడా కేంద్రం ద్వారా పరిష్కరించేందుకు ఎంపీలు సహకరించాలని కోరారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపే అంశాన్ని కూడా ప్రస్తావించారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు, చెన్నై, ముంబైలకు బుల్లెట్ రైలు మార్గాల ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయని సీఎం తెలిపారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాల కోసం భూసేకరణ పూర్తయిందని, అక్కడ ఎంఆర్వో (మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్) కేంద్రాలు, ఎయిర్ కార్గో సదుపాయాల ఏర్పాటుకు కేంద్ర సహకారం అవసరమని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో కలిసి పనిచేస్తున్నామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి, ఎంపీలకు అవసరమైన సమాచారం అందించేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక సమన్వయ అధికారిని నియమించినట్లు వెల్లడించారు. అన్ని పార్టీల ఎంపీలు సమన్వయంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.





















