ప్రతిపక్షం, జూలై 02: ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ ఆదివాసీ, గిరిజన ప్రాంతాల ఎమ్మెల్యేల బృందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని రాష్ట్ర సచివాలయంలో కలిసి వినతిపత్రం అందజేసింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో ఏజెన్సీ నియోజకవర్గాలకు అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా పోడు భూములకు పట్టాలు మంజూరు చేయడం, ఇందిర గిరి జల వికాసం పథకాన్ని అమలు చేయడం, ఐటీడీఏలను మరింత బలోపేతం చేయడం, గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యేలు కోరారు.
ఈ సమావేశంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్ పాల్గొన్నారు.
















