ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలి: కేంద్ర రక్షణ మంత్రిని కోరిన సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూన్ 23: ఆదిలాబాద్‌లో భారత వాయుసేన ఆధ్వర్యంలో నిర్మించనున్న విమానాశ్రయాన్ని అన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. ఢిల్లీలోని కర్తవ్య భవన్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై ఇద్దరు నేతలు చర్చించారు.

ఈ సందర్భంగా మూసీ నది పునరుజ్జీవనంలో భాగంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అవసరమైన రక్షణ శాఖ భూములను బదిలీ చేసినందుకు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఒకటైన ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధికి భూసేకరణ, మౌలిక వసతుల ఏర్పాటు, అవసరమైన యుటిలిటీల బదిలీ వంటి అంశాల్లో పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దేశ భద్రత, వ్యూహాత్మక అవసరాలకు ఉపయోగపడే ఈ విమానాశ్రయాన్ని విస్తృత స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వివరించారు.

భారత వాయుసేన టెర్మినల్‌తో పాటు పౌర విమానయానానికి సంబంధించిన ప్రయాణికుల టెర్మినల్, సరుకు రవాణా కేంద్రం, విమానాల మరమ్మతు మరియు నిర్వహణ కేంద్రాలు, విమానాల నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని కేంద్రాన్ని కోరారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ విమానాశ్రయాన్ని దేశంలోనే కీలక వైమానిక కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించారు.

అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పలు ప్రపంచ ప్రఖ్యాత విమానయాన సంస్థలు తమ నిర్వహణ కేంద్రాల కోసం కొత్త ప్రదేశాలను అన్వేషిస్తున్నాయని, ఆదిలాబాద్ అందుకు అనుకూలమైన ప్రాంతమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అందువల్ల ఈ విమానాశ్రయాన్ని ఆ దిశగా అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

అలాగే మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో ఏర్పాటు చేయనున్న కీలక రక్షణ పరిశోధన ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కూడా కేంద్ర రక్షణ మంత్రిని కోరారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు దోహదపడుతుందని వివరించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News