Trending Now

రక్తికట్టిన కుటుంబ రాజకీయం.. టికెట్​ కోసం సీనియర్ల కుస్తీ

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: ఎవరికి వారుగా పట్టువీడని విక్రమార్కుడిలా లోక్​సభ సీటు కోసం సీనియర్​ నేతలు పట్టుబడుతున్నారు. తమ కుటుంబీకులకు లోక్​సభ టికెట్​ దక్కించుకునేందుకు ఎవరికి వారుగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం, భువనగిరి లోక్​సభ అభ్యర్థి ఎంపిక తమ ప్యామిలీకి చెందిన వ్యక్తికే టికెట్​ కోసం ఆ జిల్లాలలో కాంగ్రెస్​లో బలమైన నేతలు ప్రయత్నిస్తున్నారు. ఎవరికి వారుగా చేసప్తున్న కుటుంబ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. కాంగ్రెస్‎కు కంచుకోటగా ఉన్న ఆ జిల్లాలలో నేతలు ఫ్యామిలీ టికెట్స్ కోసం ప్రయత్నించడంపై ఇతర కాంగ్రెస్​ నేతలు జీర్ణించుకోవడంలేదు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు వారి కుటుంబీకులకు ఇస్తే.. ఇక తమ పరిస్థితి ఎంటని వారు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు.

మూడు కుటుంబాల చేతుల్లోనే ఐదు అసెంబ్లీ స్థానాలు..

అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ముగ్గురు కీలక కాంగ్రెస్‌ నేతల కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యత లభించింది. హుజూర్‌నగర్‌, కోదాడ నుంచి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి పోటీ చేసి గెలుపొందగా.. నల్లగొండ, మునుగోడు నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్‌ రెడ్డి విజయం సాధించారు. ఇక నాగార్జున సాగర్‌లో మాజీ మంత్రి జానారెడ్డి తాను బరి నుంచి తప్పుకుని తన చిన్న కుమారుడు జయవీర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలు ఈ మూడు కుటుంబాల చేతుల్లో ఉన్నాయి.

భువనగిరి ఎంపీ టికెట్‎పై దృష్టి పెట్టిన కోమటిరెడ్డి కుటుంబం..

ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ సిట్టింగ్ స్థానాలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. ఇప్పుడు లోక్‌సభ స్థానాలను సైతం తమ కుటుంబ సభ్యులకు దక్కేలా బడా నేతలు పావులు కదిపారు. ఇప్పటికే నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డిని ప్రకటించింది. ఇక భువనగిరి లోక్‌సభ స్థానంపై కోమటిరెడ్డి కుటుంబం దృష్టి సారించింది. కోమటిరెడ్డి కుటుంబం నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు మోహన్ రెడ్డి కుమారుడు సూర్య పవన్ రెడ్డి భువనగిరి ఎంపీ టికెట్‎ను ఆశిస్తున్నారు.

భువనగిరి నుంచి తమ కుటుంబంలో ఒకరిని బరిలోకి దింపేందుకు పావులు కదుపుతున్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంపై కోమటిరెడ్డి బ్రదర్స్‎కి గట్టిపట్టు ఉంది. 2009 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపొందగా, 2014లో ఆయన ఓడిపోయారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా విజయం సాధించారు. భువనగిరి నియోజకవర్గంలో తమ పట్టును కోల్పోకుండా ఉండేందుకే కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నిస్తున్నారట. ఈ ఎంపి స్థానాన్ని తమ చేతి నుంచి చేజార్చుకోవద్దన్న పట్టుదలతో కోమటిరెడ్డి కుటుంబం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఖమ్మంలో..

ఖమ్మంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఖమ్మం లో క్​సభ సీటును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందినితో పాటు అదే జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డికి మధ్య పోరు నడుస్తోంది. అయితే తమ కుటుంబీకులకు మాత్రమే టికెట్​ దక్కించుకునేందుకు ఎవరికి వారుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే అధిష్టాన వర్గ నిర్ణయం ఎవరిని అదృష్ఠం వరిస్తుందో మరో రెండు రోజుల్లో తేలనుంది. అంత వరకు ఉత్కంఠగా సీనియర్​నేతల కుటుంబీకులతో పాటు కాంగ్రెస్​ శ్రేణులు ఎదురుచూడాల్సిందే మరీ..!

Spread the love