హైదరాబాద్, ప్రతిపక్షం, జూన్ 09: పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు అమలులో కీలక పురోగతి నమోదైంది. ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి అవసరమైన భూసేకరణలో 93 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం 888 ఆస్తుల్లో 825 ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకోగా, బాధితులకు రూ.820 కోట్ల పరిహారం చెల్లించారు.
ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పనుల పర్యవేక్షణ, సాంకేతిక సలహాల కోసం కన్సల్టెన్సీ నియామకానికి టెండర్లు ఆహ్వానించగా, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశముంది.
ఎంజీబీఎస్, దారుల్ షిఫా, పురానీ హవేలీ, అలీజా కోట్ల, హరిబౌలి, షాలిబండ, షంషీర్‌గంజ్, ఫలక్‌నుమా మీదుగా చంద్రాయణగుట్ట వరకు ఈ మార్గం విస్తరించనుంది. మార్గంలో ఉన్న చారిత్రక, మతపరమైన కట్టడాలకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రత్యేక డిజైన్లు రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
కొన్ని వక్ఫ్ ఆస్తులు, కోర్టు వివాదాలకు సంబంధించిన అంశాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉన్నప్పటికీ, పాతబస్తీ మెట్రో ప్రాజెక్టుకు దాదాపు లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది. మెట్రో అందుబాటులోకి వస్తే పాతబస్తీ రవాణా వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

















