ప్రతిపక్షం, జూలై 15: తెలంగాణలో మద్యం ధరల సవరణపై ఈ నెల 17న ధరల నిర్ణయ కమిటీ కీలక సమావేశం నిర్వహించనుంది. మద్యం ధరలను ఎంత మేర పెంచాలనే అంశంపై ఆరోజే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే ధరల నిర్ణయ కమిటీ తయారీ సంస్థలు, మద్యం వ్యాపార సంఘాల ప్రతినిధులతో దాదాపు 10 దఫాల చర్చలు జరిపింది. తాజా సమావేశంలో ధరల సవరణతో పాటు ఇతర ప్రతిపాదనలపై కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
అలాగే, మద్యం సీసాల పరిమాణాల్లో మార్పులు చేయాలని కంపెనీలు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఇందులో భాగంగా 150 మిల్లీలీటర్ల (150ml) బాటిళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

















