ప్రతిపక్షం, జూలై 07: కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభించి రైతులకు నీరు అందించాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన, కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం, బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న విమర్శలను తాను గమనిస్తున్నానన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, బ్యారేజీలో నీరు నిల్వ ఉండకపోవడం వాస్తవమేనని ఆయన అంగీకరించారు.
అయితే ఆ కారణంగా కన్నెపల్లి పంప్‌హౌస్‌ను పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం లేదని ఈటల పేర్కొన్నారు. సాంకేతికంగా పంప్‌హౌస్‌ను ఆపరేట్ చేసి రైతులకు నీటిని అందించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేషజాలకు పోకుండా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉంటే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, దోషులను శిక్షించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కానీ ఆ పేరుతో రైతులు, ప్రజలను ఇబ్బందులకు గురిచేయకూడదని అన్నారు. సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
















